ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు మంగళవారం మరోసారి జ్యుడీషియల్ రిమాండ్(14 రోజులు) విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఆమెను వెంటనే ఈడీ అధికారులు తిహార్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అయితే, వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) అధికారులు కవితను తిహార్ జైలులో విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం కుంభకోణం, పెద్ద ఎత్తున చేతులు మారడం, హవాలా రూపంలో ఢిల్లీ సీఎంకు చేరడం, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా గురించి సీబీఐ అధికారులు ఆమెను పలుమార్లు ప్రశ్నించేందుకు సిద్దమయ్యారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) సీబీఐ మీద స్పెషల్ కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తన తరఫున వాదనలు వినకుండా తిహార్ జైలులోనే విచారణకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఇది మధ్యాహ్నం 12 గంటల సమయంలో విచారణకు రానుండగా.. న్యాయమూర్తి కావేరి భవేజా ఇరు పక్షాల వాదనల అనంతరం తుదినిర్ణయం తీసుకోనుంది.
ఇదిలాఉండగా,రెండోసారి తనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కవిత తిహార్ జైలు నుంచే జడ్జి భవేజాకు ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులోని కీలక అంశాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయి.