ఢిల్లీ సీఎం అధికార నివాసం నిర్మాణ విషయంలో టెండర్ (Tender) నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై సీబీఐ (CBI) దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీలోని పేరు తెలియని ప్రభుత్వ అధికారులపై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. మొదటగా దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. విచారణ సమయంలో ఏవైనా వివరాలు వెలుగులోకి వస్తే దాని ఆధారంగా సీబీఐ రెగ్యులర్ కేసును నమోదు చేయనుంది.
ఈ కేసులో భాగంగా పలువురు ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సీఎం అధికార నివాస నిర్మాణానికి సంబంధించిన టెండర్ పత్రాలు, మార్బుల్ ఫ్లోరింగ్, మాడ్యులర్ కిచెన్ పనుల వివరాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు సమర్పించాలని ఢిల్లీ ప్రజాపనుల శాఖను సీబీఐ అధికారులు ఆదేశించారు. వాటితో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లు పూర్తి వివరాలను అందజేయాలని తెలిపారు.
సీబీఐ కేసు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. ముఖ్య మంత్రి అధికార నివాసంలో ఈ నిర్మాణాలన్నింటికీ ఈ అనుమతులు ఎవరు ఇచ్చారనే వివరాలను కేజ్రీవాల్ వెల్లడించాల్సి వుంటుందని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు. అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఈ భవనాన్ని నిర్మించారని, ఇందులో భారీగా అవినీతి చోటు చేసుకుందని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు.
బీజేపీ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. ఆప్ ను పూర్తిగా అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. దీని కోసం బీజేపీ అన్ని అధికారాలను ఉపయోగిస్తుందని వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి నిదర్శనమని చెప్పింది. దేశంలోనే అత్యుత్తమ విద్య, వైద్యం అందించిన ఆప్ మంత్రులను జైలులో వేశారన్నారు. ఎన్ని దర్యాప్తులు చేసినా సామాన్య ప్రజల కోసం ఆప్ చేసే పోరాటం ఆగదని తేల్చి చెప్పింది.