తనని త్వరలోనే అరెస్ట్ (Arrest) చేస్తారని తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాయదుర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నాలుగు రోజుల క్రితమే ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అమరావతి నిర్మాణాల విషయంలో 118 కోట్లు ముడుపులు చంద్రబాబుకు సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు ఇచ్చాయనే ఆరోపణపై ఐటీ శాఖ ఈ నోటీసులు ఇచ్చింది.
జగన్ పాలన అంతా ఆరాచకమేనని, రాష్ట్రంలో వైకాపా పాలనలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. రాయదుర్గంలో విద్యావేత్తలు, మేధావులు, న్యాయవాదులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి కొన్ని సమస్యలను వీరంతా తీసుకుని వచ్చారు. వాటిపై చంద్రబాబు మాట్లాడారు.
రైతుల భూముల్లో వారికే తెలియకుండా కాల్వలు తవ్వుతున్నారని, ఇదెక్కడి న్యాయమని, అసలు రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందని చంద్రబాబు అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడిపై కేసు వేసిన నాగేంద్రను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుందని విమర్శించారు.
తాను ఏ తప్పు చేయకుండా, నిప్పులా ఇంత కాలం బతికానని, అలాంటి తనని కూడా రేపో, మాపో అరెస్ట చేస్తారేమోనని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో అన్యాయంగా కేసులను ఎదుర్కొంటున్న వారికి, ఆస్తులు పొగొట్టుకున్న వారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని తెలిపారు. త్వరలోనే జగన్ పాలన అంతమైపోతుందని, రాష్ట్ర ప్రజలు జగన్ ను సీఎం సీటు నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.