స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
సెంట్రల్ జైలులో చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 ను ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు జైలులోని స్నేహ బ్లాక్ లో అన్నివసతులతో కూడిన ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. తన అవసరాల కోసం ఒక వ్యక్తిగత సహాయకుడిని ఏర్పాటు చేశారు. ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. ఆయనున్న బ్లాక్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రిమాండ్ నేపథ్యంలో జైలులో చంద్రబాబు మొదటి రోజు ఇలా ప్రారంభమైంది…
తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచిన చంద్రబాబు కాసేపు యోగా సాధన చేశారు. అనంతరం ఆయన్ను తన బ్లాక్ కు ఎదురుగా ఉన్న జైలు ఆసుపత్రికి తీసుకెళ్లి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు కేటాయించిన ప్రత్యేక గదికి తీసుకొచ్చి…ఇంటి నుంచి తీసుకొచ్చిన టిఫిన్ ను అందించారు.
ఎస్పీజీ భద్రత కలిగిన వ్యక్తి కావడంతో… మాములు ఖైదీలకు దూరంగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సాధాకణంగా ఖైదీలకు ప్రతిరోజూ రెండు రకాల టిఫెన్లు మాత్రమే అందిస్తారు. కానీ, కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైలు సిబ్బంది సాధారణ టిఫెన్ ఇవ్వలేదు. వ్యక్తిగత సిబ్బంది చంద్రబాబు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్నే అందించారు. చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ ను ఇచ్చారు. టిఫిన్ తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు అవసరమైన మెడిసిన్ ను ఇచ్చారు. ఆయన భోజనాన్ని కూడా ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.