అసలే.. ఎన్నికల టైమ్. పార్టీలు ఒకర్నొకరు డ్యామేజ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఏ విషయంలో దొరుకుతుందా? అని ప్రతిపక్షాలు చూస్తుండగా.. కాళేశ్వరం (Kaleswaram) వాటికి ప్రధాన అస్త్రంగా మారింది. ఇప్పటికే అవినీతి కాళేశ్వరం అంటూ విమర్శల దాడి చేస్తున్న విపక్ష నేతలు.. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కేసీఆర్ (KCR) ను ఓ ఆటాడేసుకుంటున్నారు. దీనికి బాధ్యత వహించి.. కేసీఆర్ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారు.
ఈ అంశంలో బీజేపీ (BJP) ఓ అడుగు ముందుకేసి.. కేంద్రానికి కంప్లయింట్ చేసింది. డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆయన.. కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని పంపారు. ఈ బృందం కాళేశ్వరం డ్యామ్ ను క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఏం జరగబోతోందనేది చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం ఒక్కసారిగా కొంత మేరకు కుంగింది. భారీ శబ్దంతో బీ-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కిందకు దిగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దిగినట్లు చెబుతున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఎన్నికల వేళ ఈ ఘటన అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.
మరోవైపు, బ్యారేజ్ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో 57 గేట్లు ఎత్తి, 45 వేల 260 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజ్ కి ఇన్ ఫ్లోన్ 12,240 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉండడంతో పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ కంపెనీదేనని అంటున్నారు అధికారులు. అయితే.. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కేంద్రం రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది.