అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో టెల్ అవీవ్ నగరంలోని గురియన్ విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయంలో జో బైడెన్ కు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతనాహ్యూ ( Benjamin Netanyahu) లు ఘన స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతున్నందుకు ఈ సందర్బంగా జోబైడెన్ కు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నెతన్యాహుతో బైడెన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. బైడెన్ రాక సందర్బంగా టెల్ అవీవ్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
హమాస్ మిలిటెంట్ల నుంచి దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడమె బైడెన్ పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశమని అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. హమాస్ మిలిటెంట్ల దురాగతాలను జోబైడెన్ తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
పాలస్తీనా మొత్తానికి హమాస్ ప్రాతినిథ్యం వహించడం లేదని తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఆస్పత్రి భవనంపై దాడి మిలిటెంట్ల చర్యేనన్న ఇజ్రాయెల్ సైన్యం వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. మరోవైపు బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైంది. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత జోర్డాన్ వెళ్లాలని ముందుస్తుగా బైడెన్ నిర్ణయించుకున్నారు.