Telugu News » pneumonia : చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులు…. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు….!

pneumonia : చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులు…. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు….!

చైనాలో పరిస్థితులను ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.

by Ramu

డ్రాగన్ కంట్రీలో న్యుమోనియా తరహా (Pneumonia)కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (Govt of India) అలర్ట్ అయింది. చైనాలో పరిస్థితులను ఇప్పటికే నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా న్యుమోనియాపై పోరుకు రాష్ట్రాల్లో ఆస్పత్రుల సంసిద్దతను సమీక్షించాలని రాష్ట్రాలను కోరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో ఎలాంటి సమస్య తలెత్తినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఆస్పత్రుల్లో సరిపడా మానవ వనరులు ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు ఆస్పత్రుల్లో సరిపడా బెడ్లు, అత్యవసర ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్, పీపీఈ కిట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఆరోగ్య సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు పని తీరును సరి చూసుకోవాలని ఆదేశించింది. అంటువ్యాధుల వ్యాప్తి నివారణకు ఇన్ ఫెక్షన్ నియంత్రణ ప్రోటోకాల్స్ ను నిశితంగా సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల్లో తెలిపింది. కరోనా సమయంలో సవరించిన సర్వేలైన్స్ వ్యూహానికి సంబంధించి కార్యాచరణ మార్గదర్శకాలు అమలు చేయాలని సూచనలు చేసింది.

ఇటీవల చైనాలో న్యుమోనియా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధికి సంబంధంచి మరింత డేటాను తమతో పంచుకోవాలని చైనాను కోరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. కరోనా అనుభవాల నేపథ్యంలో చైనాలో పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

You may also like

Leave a Comment