తెలంగాణలో పోలింగ్ (Polling) కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నిల అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులు ముద్రించామన్నారు. అభ్యర్థులకు ఓటరు జాబితాలను అందించామని వెల్లడించారు. ఇప్పటి వరకు 86 శాతం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు.
రైతుబంధు, డీఏ చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణలను పంపిందన్నారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య భారీగా ఉందన్నారు. ఓటర్ల నిష్పత్తి 1000:1002 గా ఉందన్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం, టెండర్, చాలెంజ్ ఓట్ల కోసం మొత్తం 14 లక్షలకుపైగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేశామన్నారు.
రేపటితో ఈవీఎం, వీవీప్యాట్ల కమిషనింగ్ పూర్తవుతుందన్నారు. మరో ఒకటి, రెండు రోజుల్లో స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందని వెల్లడించారు. 9 చోట్ల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్లు రెట్టింపు సంఖ్యలో ఉంటాయన్నారు. సువిధ యాప్ ద్వారా అనుమతుల కోసం 37,422 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 777 కేసులు నమోదు అయ్యాయన్నారు. వాటిలో ప్రలోభాలకు సంబంధించి 166 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పోలింగ్ రోజు సెలవు రోజుగా చూడరాదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 40 వేల రాష్ట్ర పోలీసులు, 25 వేల ఇతర రాష్ట్రాల పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో ఉంటాయన్ని స్పష్టం చేశారు.
సీ విజిల్ యాప్ను ఇప్పటి వరకు 6648 మంది వినియోగించారని అన్నారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.669 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధించి 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు.