బీజేపీ (BJP)పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy) ఫైర్ అయ్యారు. దేశంలోని సహకార రంగాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, మోడీ సర్కార్ ను గద్దె దించాలని పిలుపు నిచ్చారు.
సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల జిల్లా స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రైతుల పోరాటాల ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించిందన్నారు.
ఈ మేరకు రైతులకు కేంద్రం లిఖిత పూర్వకంగా హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని…పైగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని ఆరోపణలు గుప్పించారు.
రైతులపై పెట్టిన అక్రమ కేసులను మోడీ ప్రభుత్వం ఉపసంహరించలేదని అన్నారు. ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం కూడా కేంద్రం అందించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.