ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central jail) రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని సీఐడీ అధికారులు (CID Officials) విచారిస్తారు. సీఐడీ డీఎస్పి ధనుంజయుడు నాయకత్వంలోని 9 మంది అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఈ విచారణ జరుగుతుంది.
రెండు రోజులు పాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల పేరుతో సెంట్రల్ జైల్లోనే ఆయన్ని విచారించేందుకు ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులను కూడా అనుమతించారు. నిబంధనలను పాటిస్తూ దర్యాప్తు సాగాలని, ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సెప్టెంబర్ 25న జరగుతుంది. మరోవైపు చంద్రబాబు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదుల సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నట్టు ప్రకటించారు.
విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతించారు. వీరిలో 9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లు ఉంటారు. ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చునని కోర్ట్ చెప్పింది. కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు చేయాలని, విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు ఆదేశించింది.
న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలని, అయితే విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదనే నిబంధన విధించింది. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం ఉంటుంది. ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చింది. విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉంటారు.
బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు కల్పించింది. న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.. విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం. అంతే కాకుండా దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని కోర్ట్‌కు సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని కోర్టు తెలిపింది.
సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది. రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.