స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు చంద్రబాబు. ఇది అక్రమ అరెస్ట్ అని టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఇవాళ గాంధీ జయంతి నేపథ్యంలో సత్యమేవ జయతే పేరుతో దీక్షలకు దిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.
టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో ఇది జరుగుతోంది. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష జరగనుంది. ఇక, చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఒక రోజు నిరసన దీక్ష చేస్తున్నారు. తనకు అన్యాయం జరిగిందని.. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ దీక్ష చేయనున్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజమండ్రిలోని టీడీపీ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు, ఈనెల 5 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని భువనేశ్వరి భావిస్తున్నట్టు సమాచారం.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ తీర్పు అనంతరం యాత్రపై భువనేశ్వరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుప్పం నుంచి యాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు కవర్ అయ్యేలా యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు.