స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా క్వాష్ పిటిషన్ పై వాడీవేడి వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా 17ఏ చుట్టూ వాదనలు కొనసాగాయి. 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ (CID) తరఫున న్యాయవాదులు వాదించారు.
తొలుత చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమన్నారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17ఏ వర్తిస్తుందన్నారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదని.. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని తెలిపారు.
2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్ లు అన్నింటికీ 17ఏ వర్తిస్తుందన్న హరీశ్ సాల్వే.. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఇక, యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుందన్నారు చంద్రబాబు మరో లాయర్ అభిషేక్ సింఘ్వీ. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని.. చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనల తర్వాత కేసును ఈనెల 9కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ విచారణ నిర్వహించింది. స్కిల్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.