ఏపీ హైకోర్టులో చంద్రబాబు ఆశించిన ఊరట దక్కలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (Skill Development Corporation) అవినీతి కేసులో ఏపీ సీఐడీ (AP CID) రిమాండ్ రిపోర్ట్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను బెంచ్ డిస్మిస్ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ ఏసీబీ కోర్టు (ACB Court) ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు చంద్రబాబు తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మూడు రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. హైకోర్టు సీఐడీ వాదనలను సమర్థిస్తూ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు చంద్రబాబు తరపు లాయర్లు చెప్తున్నారు. ఈ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టులో వేయనున్నారు.
మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్ పై చంద్రబాబుకి ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీ అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు వెల్లడించకూడదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారే చేశారు.
చంద్రబాబును ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని సూచించారు. విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించారు. చంద్రబాబు వయసు దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.