ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu Naidu) జైలు నుంచి బయటకు వచ్చారు. రాజ మహేంద్ర వరం(Raja Mahendravaram) జైలు నుంచి ఆయన ఈ రోజు విడుదలయ్యారు. చంద్రబాబును కలిసేందుకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు.
తమ అధినేత విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. జైలు వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్రావు ఇతర నేతలు జైలు వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబును చూసేందుకు ఇటు తెలంగాణ నుంచి కూడా భారీగా టీడీపీ నేతలు వెళ్లారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున రావడంతో పోలీసులు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి చంద్రబాబు బయటకి రాగానే చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి పోయాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు రోడ్లపైకి వచ్చి తనకు సంఘీభావం తెలిపారని చంద్రబాబు అన్నారు. దీంతో తన జన్మ దన్యమైందన్నారు. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి కూడా రాదన్నారు. అలాంటి అనుభూతిని ప్రజలకు తనకు ఇచ్చారని చెప్పారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఎవరినీ తప్పు చేయనివ్వనని అన్నారు. తన అరెస్టుపై స్పందించిన ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. జనసేనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.