ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(Chandra babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్(YSR CONGRESS) కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు.
ఈసారి ఎన్నికల్లో వైసీపీ డబ్బులు పంచి గెలవాలని చూస్తోందన్నారు. డబ్బులు విచ్చలవిడిగా పంచేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందని, పోలీసులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నారని ఆరోపించారు. గడచిన నాలుగున్నర ఏళ్ల పాలనలో సీఎం జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.
అలాంటి పార్టీని ఎన్నికల్లో కట్టడి చేయాలంటే రూ.200, 500 వంటి పెద్ద నోట్లను రద్దు(200,500 Notes Ban) చేయాలని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో డిజిటల్ కరెన్సీ రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర సంపదనంతా వైసీపీ నేతలు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, దేశం బాగుకోసం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు మాజీ సీఎం ప్రకటించారు. ఇదిలాఉండగా దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన సమయంలో ప్రధాని మోడీని విమర్శించిన పార్టీల్లో తెలుగుదేశం కూడా ఒకటి. ఆ పార్టీ అధినేత మరోసారి పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రధాని మోడీతో ఈ విషయంపై చర్చించలేదని, ప్రతిపక్షంలో ఉన్నపుడే గుర్తుకు వచ్చిందా? అని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.