చంద్రుని(Moon)పై నీటి జాడల గురించి అమెరికాలోని హవాయి వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు(Research) చేస్తున్నారు. నీటి జాడల కోసం భారత చంద్రయాన్ మిషన్-1(Chandrayan-1) పంపించిన రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. భూమి పై నుంచి విడుదలవుతున్న అధిక శక్తి గల ఎలక్ట్రాన్లు చంద్రునిపై నీటిని ఏర్పరుస్తున్నాయని గుర్తించారు.
భూమిలోని ప్లాస్మా పొరలో వున్న ఈ ఎలక్ట్రాన్లు చంద్రునిపై వాతావరణ ప్రక్రియలకు దోహదం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వాతావరణ ప్రక్రియ ద్వారా చంద్రునిపై రాళ్లు, ఖనిజాలు విచ్చిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. చంద్రునిపై జరిగే ఈ వాతావరణ ప్రక్రియలు, ఈ ఎలక్ట్రాన్లు చంద్రునిపై నీరు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.
చంద్రునిపై నీటి సాంద్రత గురించి అధ్యయనం చాలా కీలకమైన అంశం అన్నారు. చంద్రునిపై నీరు ఎలా ఏర్పడింది, ఎలా రూపాంతరం చెందిందనే అంశాలపై అధ్యయనం భవిష్యత్ లో మానవ వనరుల అన్వేషణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కొత్త అధ్యాయనల ద్వారా గతంలో చంద్రునిపై నీడ ఉన్న ప్రాంతాల్లో గుర్తించిన నీటి మంచు మూలాలను గుర్తించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
జాబిల్లిపై నీటి వనరులు ఉన్నట్టు గతంలోను పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రోటాన్స్ వంటి అత్యంత శక్తి వంతమైన అణువులు ఉండే సౌరగాలి చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీ కొన్నప్పుడు ఆ ప్రాంతంలో నీరు ఏర్పడే అవకాశాలు వున్నట్టు వెల్లడించాయి. అయితే తాజాగా చంద్రుడు భూ అయస్కాంత వరణం గుండా ప్రయాణించే సమయంలో ఇది సాధ్యం కాదని గుర్తించారు. ఆ సమయంలో జాబిల్లిపై వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే అంశంపై తాజాగా పరిశోధనలు చేశారు.