చంద్రయాన్ -3 జాబిల్లికి మరింత చేరువకానుంది. కానుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)ప్రారంభించిన ఆర్బిట్ రిడక్షన్ ప్రాసెస్(Orbit reduction process)తో అనుకున్న లక్ష్యానికి చంద్రయాన్ చేరుకుంటుంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు ఆర్బిట్ రిడక్షన్ ప్రాసెస్ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
దీంతో స్పేస్ షిప్(Spaceship)చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరుకుంటుంది.ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్(Propulsion module)నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోనుంది. అయితే ఆ తర్వాతే ఇస్రో అసలైన సవాలును ఎదుర్కోనుంది.
ఆగస్టు 23న ఈ అంతరిక్షనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్న ఇస్రో… అందుకోసం ” డీబూస్ట్(Deboost)” అనే పద్ధతిని వాడనుంది. దీనితో అడ్డంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చంద్రయాన్-3 చివరి 30 కిలోమీటర్లకు వచ్చేసరికి నిట్టనిలువునా ల్యాండ్ అవుతుంది.
ఈ అంతరిక్షనౌక వేగాన్ని చివరి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు చేర్చే ప్రక్రియ అత్యంత కీలకమైన భాగమని ఇస్రో ఛైర్మన్(ISRO Chairman)ఎస్. సోమ్‌నాథ్(S. Somnath)తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఈ అంతరిక్షనౌక వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. చంద్రయాన్-2కు ఈ ప్రక్రియ వద్దే ఇబ్బంది తలెత్తిందని వివరించారు.
జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. చంద్రయాన్-3 ఆర్బిట్ రిడక్షన్ ప్రాసెస్ ఇప్పటికే మూడుసార్లు విజయవంతంగా ఇస్రో నిర్వహించింది.
బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్-ISTRAC నుంచి ఈ ప్రక్రియ చేపట్టింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి అంతకుముందు వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ x 177 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనుంది.