ఉత్తరాఖండ్ లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇటీవలే వాతావరణం కొంత తెరపినివ్వడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు చార్ ధామ్ యాత్రకు బయల్దేరారు. అయితే మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగి పడడంతో జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.
రిషికేష్ కు సుమారు 40 కి.మీ. దూరంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో ఏపీ, బెంగళూరుకు చెందినవారు కూడా ఉన్నారు. కొడియాల వద్ద రోడ్డుపైనే వీరంతా సాయం కోసం ఎదురు చుస్తున్నారు. ఇక్కడ 1500 కు పైగా వాహనాలు నిలిచిపోయాయి.
సుమారు 20 వేలమంది సాయంకోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. చార్ ధామ్ వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా భారీ వర్షాల వల్ల వీరి ప్రయాణానికి అవరోధం ఏర్పడింది.
నిజానికి మూడు, నాలుగు రోజుల క్రితమే ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడడంతో పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. కొందరు గల్లంతయ్యారు. గాయపడినవారిని సహాయక బృందాలు రక్షించి ఆసుపత్రులకు తరలించాయి.