షహీద్ చారు చంద్ర బోసు (Shaheed Charu Chandra Bose)… పుట్టుకతోనే దివ్యాంగుడు. కానీ ఆ వైకల్యం ఆయన విప్లవ పోరాటానికి ఏనాడు అడ్డు రాలేదు. అనుశీలన్ సమితి (Anusheelan Samithi), యుగాంతర్ విప్లవ సంస్థల్లో సభ్యుడిగా స్వతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లాడు. భారత విప్లవ పోరాట యోధులను ఇబ్బందులకు గురి చేస్తున్న అశుతోష్ బిశ్వాస్ ను హతమార్చి ఉరికంబం ఎక్కిన ధీరుడు.
26 ఫిబ్రవరి 1890న ప్రస్తుత బంగ్లాదేశ్‌లో జన్మించారు. తండ్రి కేశవ్ చంద్రబోస్. పుట్టుక తోనే ఆయనకు అరచేయి లేదు. విద్యాభ్యాసం పూర్తయ్యాక పలు పత్రికల్లో సంపాదకుడిగా పని చేశారు. పత్రికల్లో పని చేస్తున్న సమయంలో అనుశీలన్ సమితి, యుగాంతర్ సంస్థల్లో సభ్యుడిగా చేరి రహస్య విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆ సమయంలో మురారీపూర్ బాంబు కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసును అడ్డుగా పెట్టుకుని విప్లవ కారులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. పోలీసులకు మద్దతుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశుతోష్ బిశ్వాస్ దొంగ సాక్ష్యాలు సృష్టించి విప్లవకారులకు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చేస్తూ వచ్చాడు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత విప్లవ కారులకు ఇబ్బందులు తప్పవని, దేశానికి స్వతంత్ర్యం రావడం కష్టమని చారు బోస్ భావించారు. ఎలాగైనా అశుతోష్ ను హతమార్చాలనుకున్నారు. 10 ఫిబ్రవరి 1909న తన వైకల్యం ఉన్న చేతిలో తుపాకీని పట్టుకుని దాన్ని టవల్ లో చుట్టుకుని న్యాయస్థానంలోకి చారు బోస్ ప్రవేశించారు.
అనంతరం తుపాకీని తన చేతిలోకి తీసుకుని అశుతోష్ పైకి కాల్పులు జరిపారు. దీంతో అశుతోష్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు చారుబోసును అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా సభ్యుల పేర్లను తెలపాలని పోలీసులు చిత్ర హింసలు చేశారు. అశుతోష్ ఒక ద్రోహి అని అందుకే చంపి వేశానంటూ కోర్టులో నవ్వుతూ చెప్పారు. దీంతో కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది.