చత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) మహారాజ్ ఉపయోగించిన భాఘ్ కీ పంజా ( పులి గోళ్ల)ను భారత్ (India) కు తీసుకు వస్తున్నారు. సుమారు 350 ఏండ్ల తర్వాత శివాజీ ఆయుధం మళ్లీ భారత్ కు చేరుకుంటోంది. 1659లో బీజాపూర్ (Beejapur) సుల్తానేట్ కు చెందిన జనరల్ అఫ్జల్ ఖాన్ ను ఓడించే సందర్బంలో శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించారు.
తాజాగా దీన్ని భారత్ కు తిరిగి తీసుకు వచ్చే విషయంలో లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్ బర్గ్ మ్యూజియంతో మహారాష్ట్ర సర్కార్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై మంగళవారం మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ సంతకం చేయనున్నాయి. నవంబర్ నెలలో ఇవి భారత్ కు చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఓడించిన రోజునే ఆ పులి గోళ్లను భారత్ కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్ ను ప్రదర్శనకు పెడతామన్నారు. 1659లో జరిగిన ప్రతాప్‌గఢ్ యుద్ధంలో మరాఠాల విజయం మరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించింది.
సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఈ యుద్దంలో అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని ఆదిల్షాహి సైన్యాన్ని మరాఠాలు ఓడించారు, ఈ యుద్ధం ద్వారా ఛత్రపతి శివాజీకి అద్భుతమైన సైనిక వ్యూహకర్తగా గొప్ప పేరు వచ్చింది. మొదట ఓ పథకం ప్రకారం శివాజీని అఫ్జల్ ఖాన్ పిలిపించాడని, ఆ తర్వాత దొంగ దెబ్బతీసి కత్తితో పొడిచారని చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ వెంటనే శివాజీ ఈ పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ ను హత మార్చాడని అంటున్నారు.