ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పఠాన్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో తన కంచుకోట అంబికా పూర్ నుంచి మరోసారి పోటీ చేస్తారని పేర్కొంది.
2003 నుంచి పఠాన్ నియోజక వర్గంలో భూపేశ్ బాఘేల్ పోటీ చేస్తూ వస్తున్నారు. 2014 నుంచి 19 వరకు అదే నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా పని చేశారు. పఠాన్ నియోజక వర్గంలో భూపేశ్ బాఘేల్ కు పోటీగా ఆయన మేనల్లుడు విజయ్ బాఘేల్ ను బీజేపీ బరిలోకి దించింది. దీంతో ఈ నియోజక వర్గంలో పోటీ ఆసక్తి కరంగా మారింది.
ఇక సీతా పూర్ నుంచి అమర్ జిత్ భగత్ ను కాంగ్రెస్ పోటీలోకి దించింది. ఈ నియోజక వర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది. రజంద్ గావ్ నియోజక వర్గంలో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు పోటీగా గిరీష్ దేవగన్ ను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఈ జాబితాలో 30 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. అందులో 14 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఇక ఈ జాబితాలో ముగ్గురు మహిళలకు పార్టీ అవకాశం కల్పించింది. చత్తీస్ గఢ్ లో మొత్తం రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 7న మొదటి విడత పోలింగ్ ను, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మిగతా రాష్ట్రాలతో పాటే చత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.