రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో వున్న నేత నిక్కీ హేలీ (Nikki Heli) సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా (America) తో పాటు ప్రపంచ దేశాలకు చైనా (China) ను అత్యంత ప్రమాదకారిగా ఆమె అభివర్ణించారు. అమెరికాను ఓడించేందుకు చైనా గత యాభై ఏండ్లుగా ప్రయత్నాలు చేస్తోందని ఆమె వెల్లడించారు. అమెరికాతో యుద్ధానికి చైనా కాలు దువ్వుతోందన్నారు.
ఇటీవల ఇరు దేశాల సైనిక బలాలు సమానంగా వున్నాయన్నారు. ఇండో అమెరికన్ రిపబ్లిక్ ప్రత్యర్థి వివేక్ రామస్వామి చైనాపై విదేశాంగ విధానంపై ఒహియోలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కూడా ఆ అంశంపై మాట్లాడారు. అమెరికా మనుగడకు బలం, గర్వం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనే విషయంలో ఆ రెండు చాలా ఉపయోగపడుతాయన్నారు.
ఇటీవల అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు చైనా ప్రమాదకారిగా మారుతోందన్నారు. అమెరికాలోని తయారీరంగంలోని ఉద్యోగాలను చైనా లాగేసుకుందన్నారు. మన వ్యాపార రహస్యాలను చైనా తెలుసుకుందన్నారు. ఇప్పుడు ఔషధాల నుంచి అధునాతన సాంకేతికత వరకు అన్ని ముఖ్యమైన పరిశ్రమలపై చైనా నియంత్రణ సాధిస్తోందని వెల్లడించారు.
అతి తక్కువ సమయంలోనే వెనుకబడిన దేశం నుంచి ప్రపంచంలో రెండో అతిపెద్ది ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగిందన్నారు. ఇప్పుడు అగ్రస్థానానికి డ్రాగన్ కంట్రీ గురి పెట్టిందన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్దేశాలు చాలా స్పష్టంగా వున్నాయన్నారు. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని చైనా తయారు చేస్తోందన్నారు. అమెరికాను భయపెట్టే శక్తి సామర్థ్యాలకు చైనాకు ఉన్నాయన్నారు.