– చిరంజీవిపై బీజేపీ గురి పెట్టిందా?
– రాజ్యసభకు పంపుతోందా?
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
– కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్
– తిరిగొస్తే సీఎం అభ్యర్థి అంటూ ప్రకటనలు
రాజ్యసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై తమకున్న సంఖ్యాబలాన్ని బట్టి ఓ అంచనాకొచ్చాయి పార్టీలు. ఎవరిని నియమించాలనే దానిపై ఫోకస్ పెంచాయి. అయితే.. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కానీ, వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవికి దక్కనుందనే వార్త ప్రజెంట్ వైరల్ అవుతోంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా చిరంజీవిపై దృష్టి పెట్టింది బీజేపీ. ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడం.. వాళ్లలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కావడంతో పార్టీకి లాభం జరుగుతుందనేది కమలనాథుల భావన. అందుకే, చిరంజీవి ఫ్యామిలీకి బీజేపీ పెద్దలు కొన్నాళ్లుగా ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. రీసెంట్ గా కేంద్రం చిరుని పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. అంతకుముందు ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది.
ఏపీలో జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ. అయితే.. సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులోభాగంగానే చిరుకు రాజ్యసభ ఆఫర్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. నిజానికి, రాష్ట్రపతి కోటా సమయంలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూసింది బీజేపీ. కానీ, అప్పట్లో ఈ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి. ఈ పదవి తర్వాత దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ను వరించింది. కానీ, ఈసారి ఎలాగైనా చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవికి రాజ్యసభ పదవిలో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలో నామినేట్ అయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కానీ, 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ సినిమాలు చేసుకుంటూ బిజీ అయ్యారు. రాజకీయలకు దూరంగా ఉంటానని అనౌన్స్ చేశారు. కానీ, బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు, ఏపీ కాంగ్రెస్ కూడా చిరు రాక కోసం ఎదురుచూస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన తిరిగొస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని ఇప్పటికే కొందరు నేతలు ప్రకటించారు.