పౌరసత్వ సవరణ చట్టం ( CAA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ( Ajay Mishra) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుపై గ్రౌండ్ వర్క్ నడుస్తోందని తెలిపారు. ఇప్పటికే దీనిపై లోక్ సభ, రాజ్య సభ కమిటీలు పని చేస్తున్నాయని చెప్పారు. ఆయా కమిటీల నివేదికలు రాగానే దేశ వ్యాప్తంగా సీఏఏను పక్కాగా అమలు చేస్తామన్నారు.
పశ్చిమ బెంగాల్లోని 24 ఉత్తర పరగణాల్లో జరిగిన బహిరంగ సభలో మిశ్రా మాట్లాడుతూ…. సీఏఏ ఆమోదించినప్పుడు అనేక రాజకీయ పార్టీలు అరాచకాలను వ్యాప్తి చేశాయని అన్నారు. ఆయా పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లి దానిపై పిటిషన్లు కూడా దాఖలు చేశాయని పేర్కొన్నారు. సీఏఏ పై తాము ఖచ్చితంగా చట్టాన్ని తీసుకు రాబోతున్నామన్నారు.
తమ కేసుపై సుప్రీం కోర్టులో పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ హామీ ఇస్తోందన్నారు. సీఏఏను త్వరలోనే ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ బిల్లును డిసెంబర్ 9, 2019న లోక్ సభ, డిసెంబర్ 11, 2019న రాజ్యసభ ఆమోద ముద్ర వేసిందన్నారు. అదే ఏడాది డిసెంబర్ 12న ఇది చట్టంగా మారిందన్నారు.
జనవరి 10, 2020న ఈ చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు. చట్టంగా మారిన తర్వాత, కొన్ని నిబంధనలను రూపొందించాల్సి ఉందన్నారు. వచ్చే ఏడాది జనవరి 9 వరకు నిబంధనల రూపకల్పనకు లోక్సభ లెజిస్లేటివ్ కమిటీ గడువు విధించిందన్నారు. రాజ్యసభ లెజిస్లేటివ్ కమిటీ మార్చి 30 వరకు గడువు విధించిందన్నారు.