యూపీ (UP)కి చెందిన ఓ మహిళా జడ్జి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Dy Chandrachud)కు లేఖ రాశారు. సీనియర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ లేఖలో సీజేఐ దృష్టికి ఆమె తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన మరణానికి అనుమతి ఇవ్వాలంటూ సీజేఐని కోరారు. తాజాగా దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బందాకు చెందిన మహిళా జడ్జి ఈ లేఖను రాశారు. బారాబంకికి చెందిన జిల్లా జడ్జి తనను వేధిస్తున్నట్టు లేఖలో ఆమె ఆరోపించారు. తనను జీవించాలనే కోరిక ఏ మాత్రము లేదని లేఖలో తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా తను ఒక నడుస్తున్న శవంలా ఉన్నానని చెప్పారు. ప్రాణం లేని ఈ నిర్జీవమైన శరీరాన్ని మోయటంలో ఇక ప్రయోజనం లేదని తాను భావిస్తున్నానన్నారు.
తన జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదన్నారు. అందువల్ల తన జీవితాన్ని గౌరవప్రదంగా ముగించడానికి అనుమతించడని సీజేఐని కోరారు. ఈ లేఖపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. సీజేఐ చంద్రచూడ్ ఆదేశాల మేరకు… అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం ఖురేఖర్ లేఖ రాశారు.
మహిళా జడ్జి ఇచ్చిన ఫిర్యాదుపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీజేఐ ఆదేశించారు. ఆ లేఖపై ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి ఆరా తీస్తున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలైలో ఈ విషయంపై విచారణ చేపట్టారన్నారు. కానీ ఆ విచారణంలో ఎలాంటి ఫలితం రాలేదన్నారు. సమగ్ర విచారణ కోసం జిల్లా న్యాయమూర్తిని ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ మహిళా న్యాయమూర్తి తన లేఖలో కోరారు. కానీ ఆ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.