Telugu News » CM Jagan : సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష… ఆ విషయంలో ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం..!

CM Jagan : సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష… ఆ విషయంలో ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం..!

సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.

by Ramu
cm jagan convened high level meeting

కృష్ణా జలాల (Krishna Water) అంశంపై సీఎం జగన్ (CM Jagan) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తాజాగా కృష్ణా జలాలపై కేంద్రం విధి విధానాలను జారీ చేసిన నేపథ్యంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో సీఎం భేటీ అయ్యారు.

cm jagan convened high level meeting

కృష్ణా నదీ జలాల విషయంలో గత కేటాయింపులపై సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ-2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లో జరిగిన నష్టం గురించి అధికారులతో ఆయన చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని సమావేశంలో అధికారులు అన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అతిక్రమించేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందన్నారు. సెక్షన్‌ 89లో పేర్కొన్న అంశాలకు అవి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెప్తుందని అధికారులు అన్నారు. ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా మార్గదర్శకాలు వున్నాయన్నారు.

ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో వున్నాయని, తాజాగా గెజిట్‌ విడుదలచేశారన్నారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునః పరిశీలించరాదని చట్టం చెప్తోందన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలను చేసిందన్నారు. అలాగే గోదావరి నదీ జలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించు కోవచ్చన్నారు.

పోలవరం నుంచి రాష్ట్రం తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు కృష్ణానదిలో తెలంగాణకు అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదన్నారు. ఇది రాష్ట్రానికి నష్టమన్నారు. దీంతో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వద్దని అధికారులను ఆదేశించారు. గెజిట్‌ నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు.

You may also like

Leave a Comment