రాష్ట్రంలో అభివృద్ధి ఏది? కొత్త పరిశ్రమలు ఎక్కడ? ఉద్యోగాలు ఏవి? అన్ని వర్గాల ప్రజలకూ ఇబ్బందులే.. ఇలా జగన్ (Jagan) సర్కార్ పై ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అయితే.. వైసీపీ (YCP) నేతల నుంచి సమాధానంగా తన మూడు పెళ్లిళ్ల ఆన్సరే వస్తుందని సెటైరికల్ గా కౌంటర్ ఇస్తూ ఉంటారు. తాజాగా పవన్ పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ (CM Jagan) విమర్శలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు దత్త పుత్రుడి ఇల్లు హైదరాబాద్ లో ఉంటుంది.. ఆయన ఇంట్లో ఇల్లాలు.. మూడు నాలుగు ఏళ్లకి మారిపోతుంది.. ఒకసారి లోకల్, మరొక సారి నేషనల్, ఇంకొకసారి ఇంటర్నేషనల్.. ఆడవాళ్ల పట్ల దత్త పుత్రుడుకి ఉన్న గౌరవం ఇదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్.
ప్యాకేజీ స్టార్ కి పోటీ చేసి ఓడిపోయిన భీమవరంతో సంబంధం లేదు.. గాజువాకతో అనుబంధం లేదని మండిపడ్డారు. అభిమానుల ఓట్లు హోల్ సేల్ గా అమ్ముకోవడానికి దత్త పుత్రుడు అప్పుడప్పుడు వస్తారని దుయ్యబట్టారు. రెండు షూటింగ్ ల మధ్య గ్యాప్ లో వ్యాపారానికి వస్తారని మండిపడ్డ జగన్.. సొంత వర్గాన్ని, పార్టీని అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు.
ఇటు, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపైనా విరుచుకుపడ్డారు జగన్. చంద్రబాబు ముఖం చేస్తే స్కాములు.. తన ముఖం చేస్తే స్కీములు గుర్తుకు వస్తాయన్నారు. పేదలకి ఇళ్లు ఇవ్వకుండా ఉండడానికి చంద్రబాబు కోర్టుకి వెళ్లారని.. ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడా లేరని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేదవాడికి ఒక్క సెంట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబుకి వేల కోట్లు సంపద ఉన్న కుప్పంలో కూడా పేదలకి స్థలం ఇవ్వలేదని.. కానీ, తాము 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు చేశామని వివరించారు జగన్.