పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. తన మనసులో నిన్నటి నుంచి ఒకటే బాధగా వుందని ఆయన అన్నారు. తాను ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడక పోతే తన బతకు ఎందుకు అని అనిపిస్తోందన్నారు. తనకే చిరాకు వేస్తొందన్నారు.
తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ కు భగవంతుడు గొప్ప హోదాను ఇచ్చాడన్నారు. దశాబ్దాల కాలంగా తాను పవన్ కళ్యాణ్ వెంట తిరిగానన్నారు. పవన్ కళ్యాన్ వ్యక్తిత్వం గురించి తనకు పూర్తిగా తెలుసన్నారు.
సమాజం కోసం ఉపయోగపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. దేశం కోసం బతికే మనిషి పవన్ అని, ఆయన నిస్వార్థంగా ఉంటారన్నారు. పవన్ కళ్యాణ్ స్వలాభం కోసం ఏ పనీ చేయరన్నారు. హాయిగా షూటింగ్లు చేసుకుంటూ సూపర్ స్టార్లా జీవితం గడపాలని తాను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కు సూచిస్తానన్నారు. కానీ జనాల కోసం ఏదో చేయాలని పవన్ వచ్చారన్నారు.
పవన్ చాలా నిజాయితీ పరుడని తెలిపారు. ఎవరు కష్టంలో ఉన్నా అది తన కష్టంగా పవన్ కళ్యాణ్ భావిస్తాడని చెప్పారు. మానవ జీవితంలో కొందరికి కొన్ని చేదు ఘటనలు అనుకోకుండా జరుగుతాయన్నారు. అవి పవన్ ప్రమేయం లేకుండా జరిగిపోయాయని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. ఆ విషయాన్నే పదే పస్తావించి విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు.
అన్నీ సహిస్తూ తలవంచుకుని ప్రజల కోసం జీవిస్తున్నాడన్నారు. రాత్రి, పగలు కష్టపడి సంపాదించిన డబ్బును పార్టీకి, ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాడన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పవన్ ముందుంటాడన్నారు. ఆయనకు కులాభిమానం లేదన్నారు. దేశ ప్రజలంతా ఒక్కటేనని పవన్ భావిస్తాడన్నారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, నిజాయితీ పరుడన్నారు. తెలిసీ తెలియకుండా పవన్ పై అభాండాలు వేయకండన్నారు.