– దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నది మనమే
– మోడీ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు
– రైతులకు బాగుపడాలని..
– పది రూపాయిలు పోయినా ఫర్లేదని ఇస్తున్నాం
– హస్తం చేతకాని పాలనలో సింగరేణి నష్టపోయింది
– తెలంగాణ వచ్చాక లాభాల్లోకి తీసుకొచ్చాం
– మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది
– మాయమాటల కాంగ్రెస్, బీజేపీని తిప్పి కొట్టాలి
– రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
హస్తం పార్టీ ఏనాడూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయలేదన్నారు సీఎం కేసీఆర్ (KCR). మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ (Congress) కు దళితులపై ఉన్నది పెదవులపై ప్రేమేగానీ, నిజమైనది కాదన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ మాత్రమే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తోందని తెలిపారు. సీఎం, మంత్రులు కొలువు దీరే కార్యాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం హైదరాబాద్ లో ఏర్పాటు చేశామని చెప్పారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం.. ప్రజలే బీఆర్ఎస్ బాస్ లని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తెలిసిన పార్టీ బీఆర్ఎస్ అని.. సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ.. కానీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టిందని మండిపడ్డారు. హస్తం చేతకాని పాలనలో సింగరేణి నష్టపోయిందని.. తెలంగాణ వచ్చాక లాభాల్లోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు బేరీజు వేసుకోని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. మీ దగ్గర ఉండే ఓటు వజ్రాయుధం అని ప్రజలకు తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ఆలోచించి ఆ తర్వాత ఓటు వేయాలని సూచించారు.
ప్రధాని మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని ఆరోపించారు సీఎం. అందుకే, అన్ని వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ కు కన్ను కుట్టిందని, తీసేస్తామంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వొద్దంటున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్ల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికల విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని.. మరోసారి బీఆర్ఎస్ పార్టీనే ఆశీర్వదించాలని కోరారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
సూట్ కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా? నిఖార్సైన నాయకులు కావాల్నా? అనేది నిర్ణయించాల్సింది ప్రజలేనని అన్నారు కేసీఆర్. ‘‘రైతులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. కరెంట్ సక్రమంగా ఇవ్వలేదు. పాములు కుట్టి అనేక మంది చనిపోయారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న గవర్నమెంట్ మనదే. మోడీ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. రైతులకు కచ్చితంగా బాగుపడాలి అని పది రూపాయిలు పోయినా సరే అని చెప్పి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ దొంగలు వచ్చి తీసేస్తాం అంటున్నారు. ఓట్లు కాదు డిపాజిట్లు కూడా రావొద్దు కాంగ్రెసోళ్లకు. రైతులు ఆలోచించి, ఓటేయకపోతే నేను కూడా ఏం చేయలేను’’ అని వ్యాఖ్యానించారు కేసీఆర్.