– డబ్బు సంచులతో దొరికిన దొంగ..
– నాపై పోటీ చేస్తున్నాడు
– జనం బుద్ధి చెప్పాలి
– తెలంగాణను విచ్ఛిన్నం చేసే..
– కుట్రలు జరుగుతున్నాయి
– చేసిన అభివృద్ధిని గమనించాలన్న సీఎం
– గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్
– కాంగ్రెస్, బీజేపీపై విమర్శల దాడి
బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు ఒకటేనని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్ (CM KCR). గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ముందుగా గురువారం ఉదయం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్. సమీకృత భవనంలో నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. నామినేషన్ అనంతరం ప్రచార రథంపై హెలిప్యాడ్ చుట్టూ తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి లబ్ధి పొందాలని కాంగ్రెస్, బీజేపీల హామీలు చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. దీన్ని ఆ పార్టీలు గతానికి భిన్నంగా కేటాయిస్తున్న సీట్లు తేటతెల్లం అవుతోందని చెప్పారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని… కానీ బీసీలకు టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయ్యిందన్నారు. బీసీలకు ఇచ్చిన మాటను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదన్న ఆయన.. మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇక, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేయడంపై సీఎం స్పందించారు. డబ్బుల సంచులతో నగ్నంగా నడిరోడ్డు మీద దొరికిన ఒక దొంగ తన మీద పోటీ చేస్తున్నాడని సెటైర్లు వేశారు. ఓట్ల కోసం ఎవడెవడో వచ్చి అనేక ప్రలోభాలు పెట్టాలని చూస్తారని.. ఆ ప్రలోభాలకు లొంగొద్దని.. కామారెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని.. రైతులకు, భూ యజమానుల కష్టాలు తీర్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. దయచేసి చేసిన అభివృద్ధిని, బాగుపడిన బతులకులను చూడండని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురికావొద్దని కోరారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కామారెడ్డిని జిల్లా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని.. కాళేశ్వరం పనులు ఆగమేఘాలపై జరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రెండేళ్లలో రెండు ప్రాంతాల్లో నీళ్లు పారుతాయని వెల్లడించారు. త్వరలోనే విద్యా సంస్థలు, అనేక పరిశ్రమలు తీసుకువస్తామని.. ప్రజలు ఊహించని అనేక అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కామారెడ్డి రూపురేఖలు మారుతాయని.. అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపుతానని స్పష్టం చేశారు.
రైతు బంధు నిధులు నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయని.. ధరణి తొలగిస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారినే బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్న ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించారని గుర్తు చేశారు. నాయకులను కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో తనపై పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.