– కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి..
– రైతులు అరేబియా సముద్రంలోకే
– మళ్లీ బ్రోకర్ల రాజ్యమే
– బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చ జరగాలి
– దుర్మార్గపు కాంగ్రెస్ ను రైతులు మట్టి కరిపించాలి
– ఆలోచించి ఓటెయ్యాలన్న సీఎం
సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లా కనుమరుగు అయిందన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. నీళ్ల కోసం గతంలో ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక నిజాం సాగర్ కు పూర్వ వైభవం తెచ్చామని తెలిపారు. భవిష్యత్ లో నిజాం సాగర్ కు డోకా లేదన్నారు. పాత జిల్లాను సాగు నీరు, పంటలతో కళకళలాడిస్తానని చెప్పారు. చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు అభివృద్ధి చేశామని వివరించారు.
సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిన పాపం కాంగ్రెస్ (Congress) దేనని విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ శత్రువన్నారు. 15 ఏళ్ల పాటు ఏడిపించారని.. ప్రజా పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూస్తూనే ఉన్నారని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు.. అదే జరిగితే.. రైతుబంధు, రైతుబీమాకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది.. టైం కు డబ్బులు ఇస్తోంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్రోకర్ల రాజ్యం వస్తుందని విమర్శించారు.
తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. ఇక్కడి పథకాలు మహారాష్ట్ర ప్రజలకు కూడా కావాలని అడగుతున్నారని అన్నారు సీఎం. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం.. ధరణి, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నాం.. సాగునీటికి లోటు లేదన్నారు. కులం, మతం పేరుతో ఇంకా గొడవలు జరుగుతున్నాయి.. ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాల్సి ఉందని తెలిపారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారని అన్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలన్న కేసీఆర్.. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దుబారా అని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని ఎద్దేవ చేశారు. హస్తం గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్ అంటారని వ్యంగ్యంగా విమర్శించారు. దుర్మార్గపు కాంగ్రెస్ ను రైతులు మట్టి కరిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ఇటు ప్రధాని మోడీపైనా సెటైర్లు వేశారు. రాష్ట్రం కోసం ఎన్నో అడిగామని.. నిర్లక్ష్యం చూపారని అన్నారు. పీఎం స్వరాష్ట్రం గుజరాత్ లో సైతం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని వివరించారు కేసీఆర్.