తెలంగాణ బాగుపడాలంటే మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్నీ బాగు చేసుకుంటున్నామని చెప్పారు. పాలమూరులో కరువు రాకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ ఆనాడు మాట్లాడలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలకు ఎప్పుడూ పదవుల మీదే ఆశ అని విమర్శించారు. ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వేస్ట్ అంటున్నారని మండిపడ్డారు కేసీఆర్. 3 గంటల కరెంట్ తో ఎన్ని పంటలు పండుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉండే పింఛన్ ను రూ.2వేలకు పెంచామని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు వృధా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామన్నారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ గతంలో పెండింగ్ లో పెట్టిందని వివరించారు సీఎం. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలేనని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలే ఆగం చేశారని ఆరోపించారు. పేదల బాధలు పట్టించుకోలేదని.. వాళ్ల కడుపు నింపాలన్న సోయి లేదని మండిపడ్డారు. రైతుల పొలాలకు నీరిచ్చే ఆలోచన చేయలేదని ఆనాటి విషయాలను గుర్తు చేశారు. వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలంపూర్ అవసరాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కావాలని కోరారని.. దాన్ని కంప్లీట్ చేసుకున్నామన్నారు. చెరువులన్నీ మిషన్ కాకతీయ కింద బాగు చేసుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు సీఎం. ‘‘మల్లమ్మకుంట రిజర్వాయర్ ఇక్కడ కావాలి. తప్పకుండా రిజర్వాయర్ ను చేసి పెడతాం. చిన్నోనిపల్లి త్వరగా పూర్తి కావాలి. నెట్టెంపాడు 99-100 ప్యాకేజీ పెండింగ్ పనులన్నీ పూర్తి కావాలని కోరుతున్నారు. ఇవన్నీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని మనవి చేస్తున్నా’’ అని చెప్పారు కేసీఆర్. అలంపూర్ సభ తర్వాత కాల్లాపూర్ వెళ్ళారు సీఎం.