– కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు
– దేశమంతా ఇదే తీరు
– బీఆర్ఎస్ గెలుపు పక్కా
– 90కి పైగా స్థానాల్లో గెలుస్తాం
– కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మితే..
– మరో 50 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళుతుంది
– ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్
కాంగ్రెస్ (Congress) పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవ చేశారు సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ (Huzurnagar) లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో వాడవాడకు సీఎంలే ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశమంతా కాంగ్రెస్ ది ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు.
పార్టీల తరపున నిలబడే వ్యక్తులనే కాదు.. ఆ పార్టీల నైజం, దృక్పథం గురించి తెలుసుకోవాలి అని సూచించారు కేసీఆర్. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని.. 90 సీట్లకు పైగా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోందని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నేతలు ఏనాడూ కోరుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు నమ్మి మోసపోతే మరో 50 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను, రైతుబంధును, ఉచిత కరెంట్ ను అన్నింటినీ బంద్ చేస్తారని అన్నారు.
ఉచిత కరెంట్ 3 గంటలు సరిపోదా? అని ప్రశ్నించిన హస్తం నేతలు కావాలో, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు సీఎం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. ఆ సమస్యలను అధిగమించుకున్నామని తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నామని.. వారి హక్కులను కాపాడామని చెప్పారు. ఓటును దుర్వినియోగం చేయొద్దని.. ఆగమాగం కాకుండా ఆలోచించి వేయాలని సూచించారు.
‘‘ప్రజలు గెలిచే ఎన్నికనే నిజమైన ప్రజాస్వామిక ఎన్నిక. అప్పుడే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే.. ఏది నిజమో తేల్చిన తర్వాత ఓటు వేయాలని కోరుతున్నా’’ అని చెప్పారు. దళిత బిడ్డలు అనాదిగా వివక్షకు, వెనుకబాటుతనానికి గురువతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎందుకు ఈ దుస్థితి. ఎందుకు ఉండాలి ఈ ఖర్మ. మన లాగా వారు పుట్టలేదా? వారు సాటి మానవులు కాదా? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ ఈ ఆలోచన చేసి ఉంటే దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు’’ అని విమర్శించారు. ఎన్నికలు రాగానే గోల్ మాల్ చేయాలి.. మందు సీసాలు, డబ్బు సరఫరా చేయాలనేది బీజేపీ, కాంగ్రెస్ పని అంటూ మండిపడ్డారు కేసీఆర్.