– బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
– ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు
– ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు
– కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది
– ఆ పార్టీని నమ్మితే పదేండ్ల కష్టం బూడిదలో పోసినట్టే
– పదేండ్లలో మేమేం చేశామో గుర్తు చేసుకోండి
– రాష్ట్ర ప్రజలను కోరిన సీఎం
తెలంగాణ (Telangana) లో బీజేపీ (BJP) కి ఓటు వేస్తే.. మోరీలో వేసినట్లేనని అన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (BRS) ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ (Modi) ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పదేళ్లుగా ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదని.. మెడికల్ కాలేజీ కోసం ఎన్నో వినతులు ఇచ్చినా సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. అసలు, రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే గోదావరి నదికి కరకట్ట కడతామని.. చుక్క నీరు కూడా రాకుండా ముంపును కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ (Congress) నాయకులు కొత్త పద్దతి మొదలుపెట్టారని.. తనను గెలిపించండి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతా అని అంటున్నరని తెలిసిందన్నారు సీఎం. అదంతా అబద్ధం, ఝూటా ముచ్చట అని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాము పదేండ్లు కష్టపడి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ లో ఉంచామని తెలిపారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ మాయం చేసిందనట్టు ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని చెప్పారు.
24 గంటల కరెంట్ కాదు.. మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్ పార్టీ అంటుందని.. దీని వల్ల రైతులు నష్టపోతారంటూ విమర్శలు చేశారు కేసీఆర్. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ధరణి ఉండదని చెబుతున్నారని.. అలా అయితే రైతు భరోసా ఎలా వస్తుందని నిలదీశారు. సింగరేణిలో సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది కూడా కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని గుర్తు చేశారు.
అభ్యర్థుల వెనుక ఉన్న చరిత్ర చూసి ఓటేయాలని.. బీఆర్ఎస్ చేసిన ఉద్యమం చూసి ఓటేయాలని జనానికి పిలుపునిచ్చారు సీఎం. 2004లోనే రాష్ట్రం ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఆపార్టీ ఉన్న తెలంగాణను ఊడ గొట్టింది అని మండిపడ్డారు. తలాపున గోదావరి పారినా తాగే నీళ్ళు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు ఉందా? అని ప్రశ్నించారు. రైతు చనిపొతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ల ఇంటికే పంపిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదని విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్.