Telugu News » KCR : వచ్చే ఆరేళ్లు కీలకం!

KCR : వచ్చే ఆరేళ్లు కీలకం!

ఒకడు మీటర్ పెట్టాలి అంటాడు.. ఇంకొకడు 3 గంటల కరెంట్ చాలు అంటాడు.. వ్యవసాయం చేసిన మొహాలేనా.. మూడు గంటల కరెంట్ సరిపోతదా.. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

by admin
CM KCR Speech In BRS Public Meeting At Medak

– రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవు
– గ్రామాలు ప‌చ్చ‌బ‌డుతున్నాయి
– మంచి మంచి ఇండ్లు క‌డుతున్నారు
– గ్రామాల్లో కార్లు పెరిగాయి
– ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం
– రాబోయే ఆరేండ్ల‌లో మ‌రింత బ్ర‌హ్మాండం
– అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధిస్తున్నాం
– మోస‌కారుల మాట‌లు న‌మ్మితే గోస‌ప‌డుతాం
– 200 ఇచ్చినోడు.. 4 వేలు ఇస్తామంటే న‌మ్మొచ్చా?
– మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్

ఎవరైతే ధరణిని తీసేయాలని అంటారో వాళ్లనే తీసి బంగాళాఖాతంలో వేయాలన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). మెదక్ (Medak) జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ (BRS) ఆఫీస్ లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభలో మాట్లాడారు. ధరణి తీసేస్తే మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలన్నారు. ధరణి వల్ల ఇవాళ భూములు 15 నిముషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని చెప్పారు. దీనివల్లే రైతుబంధు, రైతుభీమా వస్తున్నాయని తెలిపారు. రైతు బీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదని కేవలం తెలంగాణలోనే ఉందన్నారు.

CM KCR Speech In BRS Public Meeting At Medak

ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు కేసీఆర్. ఇప్పటి వరకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. కర్ణాటకలో గెలిచిన కంగ్రెస్ తెల్లారే దుకాణం బంద్ చేసిందని విమర్శించారు సీఎం. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మంచి నీళ్ళు ఇయ్యలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నామని.. కోటి 3 లక్షల మందికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. వాళ్లకు రాష్ట్రం అప్పగిస్తే ఆగం అవుతామని.. మహారాష్ట్ర రైతులు కూడా తెలంగాణ తరహా పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

ఒకడు మీటర్ పెట్టాలి అంటాడు.. ఇంకొకడు 3 గంటల కరెంట్ చాలు అంటాడు.. వ్యవసాయం చేసిన మొహాలేనా.. మూడు గంటల కరెంట్ సరిపోతదా.. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు 200 పెన్షన్ ఇచ్చినోడు.. ఇప్పుడు 4వేలు ఎలా ఇస్తారని అడిగారు కేసీఆర్. ‘‘ఇవాళ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవు. రైతుల ముఖాలు ఇప్పుడిప్పుడే తెల్ల‌ప‌డుతున్నాయి. గ్రామాలు ప‌చ్చ‌బ‌డుతున్నాయి. మంచి మంచి ఇండ్లు క‌డుతున్నారు. గ్రామంలో కార్లు పెరిగాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. రాబోయే ఆరేండ్ల‌లో రైతులు మ‌రింత బ్ర‌హ్మాండంగా త‌యార‌వుతారు’’ అని తెలిపారు.

ఇక మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి వరాలు కురిపించారు. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల అభ్యర్థన మేరకు వివరాలు ప్రకటించారు. చాలా రోజులుగా ప్రజలు డిమాండ్ చేస్తున్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తున్నట్లు చెప్పారు. రామాయంపేట, కౌడిపల్లి మండలాలకు డిగ్రీ కళాశాలలు, రింగ్ రోడ్డు, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే, ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు, 469 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు వివరించారు సీఎం కేసీఆర్.

You may also like

Leave a Comment