– కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం
– ఓసారి అవన్నీ గుర్తు చేసుకోండి
– పదేళ్లలో రాష్ట్రం ఎలా మారిందో చూడండి
– ఆ పాలనను మా పాలనను పోల్చి చూడండి
– ఎన్నికలొచ్చాయని ఆగం కావొద్దు
– ఆలోచించి ఓట్లు వేయండి
– తెలంగాణ ప్రజల కోసం పుట్టింది బీఆర్ఎస్
– ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్
తెలంగాణ (Telangana) కు కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరుతో 58 ఏండ్లు గోసపడ్డామన్నారు. చాలా బాధపడ్డామని గుర్తు చేశారు. తెలంగాణను ఆ పార్టీ నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ అనేది ఢోకా పార్టీ అని మండిపడ్డారు సీఎం. ఐదేళ్ల వరకు తలరాతలను మార్చేది ఓటు హక్కేనని, బీఆర్ఎస్ ను మూడోసారి ఆశీర్వదించాలని కోరారు. 24 గంటలపాటు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. దేశంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పోరాటానికి భయపడే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు తాను పోరాడానన్నారు. తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం బీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు.
‘‘పదేండ్ల నుంచి ప్రభుత్వం నడుపుతున్నాం. గత ప్రభుత్వాలకు బీఆర్ఎస్ కు తేడా ఆలోచించాలి. అభివృద్ధి మీ కండ్ల ముందుంది. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఉన్న రాష్ట్రాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఏపీలో కలిపారు. దాంతో 58 ఏండ్లు గోస పడ్డం. నష్టపోయాం. బాధపడ్డాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 2004లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పిందని.. అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏడాది, రెండేండ్లకు కూడా ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేసిందని ఆరోపించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా.. ఇప్పటి వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ రావాల్సిన పరిణితి రాలేదన్నారు కేసీఆర్. ఏ దేశాల్లో అయితే ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిందో అవి చాలా బాగా ముందుకు పోతున్నాయని తెలిపారు. మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి లేదన్నారు. ‘‘ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తారు. మీరు చాలా సార్లు ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ప్రతి పార్టీ తరపున ఒకరు నిలబడుతారు. 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కింపు అయిపోతది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా.. ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి. ఆషామాషీగా, అలవోకగా ఓటు వేయొద్దు’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చలు జరపండని సీఎం ప్రజలకు సూచించారు. పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ లేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకు రూ.900 కోట్లు కేటాయించారని.. అదే బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు రూ.12వేల కోట్లు కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు.