-2020లో బయటపడిన సమస్యలు
-మూడేండ్లుగా ఎల్ అండ్ టీకి నోటీసులు
-కోటి ఎకరాల మాగాణి పచ్చి అబద్దం
-కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటిఎం
-లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు
-లెక్కలు తేల్చేందుకే పవర్ పాయింట్
-సభకు వచ్చేందుకు భయమా
-కేసీఆర్ గౌరవాన్ని తగ్గించబోం
-అసెంబ్లీకి వచ్చి సూచనలు చేయండి
-కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కృష్ణా జలాలా విషయంలో కాంగ్రెస్ (Congress),బీఆర్ఎస్ (BRS) మధ్య వాటర్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతో ఆ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు సందర్శనతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ గాడ్పు తీసేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
కేవలం కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందని విమర్శలు గుప్పించారు. తాము అడిగితే సలహాలు ఇస్తానని చెబుతున్నారని అన్నారు. మరి అలాంటప్పుడు సభకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని సెటైర్ వేశారు. సక్కగ లేని తీర్మాణానికి అసెంబ్లీలో హరీశ్ రావు ఎలా మద్దతు ఇచ్చారని నిలదీశారు. హరీశ్ రావు మాటలకు విలువ లేదా? అని అడిగారు.
మేడిగడ్డ బ్యారేజీని ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరారవు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీకు సంబంధించి ఇతర నేతలు ప్రాజెక్టును పరిశీలించారు.
ఈ సందర్బంగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. సీఎం కుర్చీ పోగానే నల్లగొండ నీళ్లు, ఫ్లోరైడ్ బాధితుల బాధలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గౌరవాన్ని తాము తగ్గించబోమన్నారు. కానీ, చేసే సూచనలు అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు.
రెండేండ్ల క్రితం మేలో ప్రాజెక్టులో సమస్యలు బయటపడ్డాయన్నారు. అప్పుడే వరుసగా మూడేండ్లు అధికారులు ఎల్అండ్టీకి నోటీసులు పంపారన్నారు. 2019 లోనే పూర్తయిన ప్రాజెక్ట్‌కు 2020 లో పూర్తిగా సమస్యలు బయటపడ్డాయని వవరించారు. అయినప్పటికీ రూ.15,900 కోట్ల బిల్లులు చెల్లించారని తెలిపారు. అధికారులు లెటర్స్ రాసినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మొత్తం కుంగిపోయి, కూలిపోయే స్థితికి వచ్చిందని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి అంటూ బీఆర్ఎస్ చెబుతున్నవి పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గత ప్రభత్వ లెక్కలు తేల్చేందుకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 19.53 లక్షల ఎకరాలేనని తెలిపారు. కానీ కొత్తగా కేవలం 95 వేల ఎకరాలకు ఆయకట్టుకు మాత్రమే నీళ్లిచ్చారని అన్నారు.
కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పారని ఫైర్ అయ్యారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని అన్నారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరించిందని చెప్పారు. కానీ సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
తాము దిగిపోయాము కాబట్టి తమకేం సంబంధం లేదని కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్ పూర్తవటంతో తమ బాధ్యత తీరిపోయిందని ఎల్అండ్టీ చెబుతోందన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన అనంతరం ప్రాజెక్టు వద్ద వాఘా బార్డర్‌ను మించిన పోలీస్ ఫోర్స్‌ను గత ప్రభుత్వం మోహరించిందన్నారు. అక్కడి వాస్తవాలు చూపేందుకు, సభ్యులందరికీ మేడిగడ్డలో ఏం జరిగిందో తెలియజేయడం కోసమే ఈపర్యటన ఏర్పాటు చేశామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు అని అన్నారు. కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందన్నారు.
ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని ఆరోపణలు చేశారు. వానాకాలం నీరు వస్తే, సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పిన మరుసటి సంవత్సరమే సమస్యలు బయటడ్డాయన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమని అమెరికాలోనూ ప్రచారం చేశాని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందన్నారు. మీ ఇళ్లలో కనకవర్షం కురిసిందని తాము అనడం లేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి కారకులెవరు? దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలను చర్చించడానికి ఆహ్వానిస్తున్నాము.
గోదావరిపై రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టును, రూ.లక్షా 47 వేల కోట్లకు పెంచారని అన్నారు. ఇరిగేషన్ శాఖలో ఫైళ్లన్ని మాయం కావడంతోనే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించామన్నారు. విజిలెన్స్ రిపోర్టులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. . మేడిగడ్డ పర్యటన అనంతరం సాగు నీటి శాఖ మంత్రి అసెంబ్లీలో త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తారు.