సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. దోషులు ఎవరనే విషయం త్వరలోనే తేలిపోతుందని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము అబద్ధాల బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ఈ నెల 13న ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు తీసుకెళ్తామని చెప్పారు. కేవలం తమ ఎమ్మెల్యేలనే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకు వెళ్తామని అన్నారు. ఈ టూర్ కు కేసీఆర్ కూడా ఆహ్వానిస్తామని వెల్లడించారు.
అనంతరం మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. నీటి పారుదల శాఖపై అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
అసెంబ్లీలో తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానని చెప్పారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే వారిని కులుపుకుని పోతామన్నారు. బీఆర్ఎస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గూటికి చేరతారని జగ్గారెడ్డి అంటున్నారని…. ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరిక విషయం గురించి కూడా ఆయననే అడగాలన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ గురించి బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా తాము తప్పకుండా తీసుకుంటామన్నారు. కేంద్రాన్ని అదనంగా అడిగి కూడా నిధులు తెచ్చుకుంటామని వివరించారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తన చేతిలో లేదన్నారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.