సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను (Amit Shah) కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అమిత్ షాతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో , జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఈ సందర్బంగా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఇది ఇలా వుంటే కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హైకమాండ్‌తో ఆయన చర్చించనున్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, ఇతర అంశాలపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్ లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ లోపే కొన్ని పదవులను భర్తీ చేస్తారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిని గుర్తించి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు ఏఐసీసీ కార్యదర్శులు ఓ జాబితాను తయారు చేస్తున్నారు. దానిపై హైకమాండ్ తో చర్చించి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.