సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అవును తాను ఒక గుంపు మేస్త్రీనని చెప్పారు. మీరు విధ్వంసం చేసిన తెలంగాణ (Telangana)ను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రీనని అన్నారు. మీకు ఘోరీ కట్టే మేస్త్రీని కూడా తానేనని చెప్పారు. ఈ నెలలోనే తాను ఇంద్రవెల్లికి రాబోతున్నానని, కాస్కోండంటూ సవాల్ విసిరారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల బూత్ లెవల్ సమావేశ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.
తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను రాజ్యసభ ఎంపీలుగా కేసీఆర్ చేశారని విమర్శించారు. రూ. 50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామ్యూల్‌కి తాము టికెట్ ఇచ్చామని గుర్తు చేశారు. తనకు పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అని చెప్పారు. మరో రెండు హామీల అమలుకు తమ ప్రభుత్వం రెడీ అయిందన్నారు. ఫిబ్రవరి చివరి వరకు రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో మార్చి వరకు రైతు బంధు ఆపిన సన్నాసులే ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాలేదన్నారు. వాళ్ల ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేని సన్నాసులు.. బిల్లా రంగాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయల్దేరారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత పాలకులు తీసుకొచ్చారని ఆరోపణలు గుప్పించారు.
సంక్షోభంలో ఉన్న దేశానికి సోనియా గాంధీ స్థిరత్వాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పదవులు చేపట్టే అవకాశం వచ్చినా.. సోనియా గాంధీ తీసుకోలేదని వెల్లడించారు. ఎన్నో పదవులను ఆమె త్యాగం చేశారన్నారు. గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదన్నారు. 18ఏండ్ల యవతకు ఓటు హక్కు వచ్చిందంటే దానికి రాజీవ్ గాంధీ కారణమని వివరించారు.
ఆయన వీరమరణం పొందినప్పటికీ ప్రజల కోసం సోనియా గాంధీ ముందుకొచ్చారని అన్నారు. గాంధీ కుటుంబం త్యాగాలు చేసినప్పుడు ప్రధాని మోడీ ఎక్కుడున్నారని ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్‌ను వేధించేందుకే ప్రధాని మోడీ ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎలాగైతే కష్టపడి పార్టీని గెలిపించామో.. లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మోడీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కార్యకర్తలను కోరారు.