నుమాయిష్ 2024 ఎగ్జిబిషన్ (Numaish Exhibition)ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తుందని తెలిపారు. నగరవాసులతో పాటు అందర్నీ అలరించేందుకు నుమాయిష్ రెడీ అయిందని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
నుమాయిష్ లో పాల్గొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇది ఇలా వుంటే గత 82 ఏండ్లుగా నుమాయిష్ ప్రదర్శన కొనసాగుతోందని నిర్వాహకులు అన్నారు. ఇది 83 వ ఏడాదని, 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిబిషన్ ప్రవేశానికి రూ.40 రుసుము ఉంటుందన్నారు. ప్రత్యేకంగా భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని వివరించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించి ఎగ్జిబిషన్ కు రావాలని కోరారు. మరోవైపు వృద్ధుల కోసం 100 వీల్‌ఛైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.