కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సోనియాతో ఆయన పలు అంశాల గురించి చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు.. పాలన జరుగుతున్న తీరును సోనియాకు రేవంత్ రెడ్డి వివరించారు.
సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయనతో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కాంగ్రెస్ నేతలు కోరినట్టు తెలుస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరినట్టు సమాచారం. ఆ స్థానం నుంచి పోటీకి ఆమె ఆసక్తి చూపని పక్షంలో రాష్ట్రంలోని మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపేందుకు రాష్ట్ర పార్టీ ఆసక్తిగా ఉన్నట్టు ఆమెకు చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు త్వరలో అమలు చేయనున్న రెండు గ్యారెంటీలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావాలని కోరినట్టు సమాచారం.
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకు ఏయే గ్యారెంటీలను అమలు చేశామో సోనియాకు వివరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో పాటు ఇంకా అమలు చేయాల్సిన గ్యారెంటీల గురించి ఆమెతో చర్చించామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న తీరును గురించి సోనియాకు వివరించామని పేర్కొన్నారు.
గత రెండు నెలల కాలంలో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డు అయ్యాయని వివరించామని తెలిపారు. త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు సోనియాకు చెప్పామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు ఆమె దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. పథకాల అమలు తీరుపై సోనియా గాంధీ అభినందించారని తెలిపారు.