-ఇరిగేషన్‌లో తప్పులకు వాళ్లదే బాధ్యత
-కేసీఆర్, హరీశ్ క్షమాపణ చెప్పాలి
-ప్రాజెక్టు నిర్ణయం కేసీఆర్ సొంత నిర్ణయం
-హరీశ్ అబద్దాలు చెప్పారు
-చేవెళ్ల చెల్లెమ్మ సరిదిద్ద వద్దా
-ఈ దుర్మార్గాలకు మీరు బాధ్యులు కారా
-సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నిపుణుల సూచనలను పక్కనబెట్టి మాజీ సీఎం కేసీఆర్ (KCR) సొంతంగా నిర్ణయం తీసుకొని మేడిగడ్డను నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పలానా చోటే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్‌కని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు కానీ ఆయనే ఇంజినీర్లకు సలహా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.
ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదని అన్నారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు కళంకంగా మిగిలిపోయిందని నిప్పులు చెరిగారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలన్నది కేసీఆర్ ఆలోచనే అని తెలిపారు.
ప్రాణహిత ప్రాజెక్ట్ చేవెళ్లకు మారడానికి కారణం చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. తమ్ముడు హరీశ్ రావు అబద్ధాలు చెబుతుంటే చేవెళ్ల చెల్లెమ్మ సరిదిద్ద వద్దా అంటూ నిలదీశారు. కాళేశ్వరం దుర్గార్గాలకు మీరు బాధ్యులు కాదా అంటూ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ పాపాలకు హరీశ్ రావులే కారణమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి పారుదల శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక అంటున్నారని బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గత తప్పులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను ప్రశ్నిస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా వాదించడం సిగ్గుచేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇరిగేషన్‌లో జరిగిన పాపాలన్నింటికీ కేసీఆర్, హరీశ్ రావులే కారణమని ధ్వజమెత్తారు. జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పి.. సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలని సూచనలు చేశారు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసిందని చెప్పారు. ఆ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారు.
‘తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వ తప్పులు ఒప్పుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. తప్పులు ఒప్పుకుని సలహాలు ఇస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేది. తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు. మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారని’ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లను అప్పటి సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 151 మీటర్ల వద్ద కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేసిందన్నారు. కనీసం 150 మీటర్ల వద్ద అయినా ప్రాజెక్టు కట్టేందుకు ఒప్పించాలని కోరిందని చెప్పారు. కానీ ఇంజినీర్ల నివేదికను గత ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకుని మేడిగడ్డను నిర్మించారని మండిపడ్డారు.
రాష్ట్రానికి కేసీఆర్, హరీశ్‌రావు ఎంత ద్రోహం చేశారో అనే విషయం ఈ నివేదిక ద్వారా తెలుస్తుందని వివరించారు. ప్రాజెక్టు అంచనాలను రూ.1.47 లక్షల కోట్లకు పెంచారని… ఖర్చు పెట్టిన నిధులు ఉపయోగపడి ఉంటే దాని గురించి ఇంత సమయం చర్చించాల్సిన అవసరంలేదన్నారు. మేడిగడ్డ మేడిపండేనా అని 2015లో మీ మిత్రుడి పత్రికలో వచ్చిందని ఎద్దేవా చేశారు. వాస్తవాలను పెడచెవిన పెట్టి దోచుకుని దాచుకోవాలని చూశారని ఆరోపణలు గుప్పించారు.