తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు డీజీపీ రవి గుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ, నియామకాలపై చర్చించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు, కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణపై సమావేశంలో అధికారులతో సీఎం చర్చించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో పాటు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అంశంపై కూడా సమీక్షలో అధికారులతో సీఎం చర్చించారు. ఇది ఇలా వుంటే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాతో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు.
అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సోమవారం సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. ఈ రాజీనామాను గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించనట్టు రాజ్ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్వహించిన గ్రూపు-1తో పాటు పలు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులే ప్రధాన నిందితులుగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యలో నిరుద్యోగులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కానీ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.