అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ (six guarantees )లను ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. తాజాగా మరో గ్యారెంటీని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు నగదు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు గాను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి కోసం భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు.
ఈ మేరకు గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసే ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు సచివాలయంలో మేడారం మహాజారత పోస్టర్ ను ఆవిష్కరించారు.