హైదరాబాద్లో మూసీ ప్రాజెక్టు (Musi Project)ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మూసీనది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు.
డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ జె. పాండియన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…. మూసీ రివర్ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నట్లు వివరించారు.
దీని కోసం కావాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులు, విద్యాసంస్థల హాస్టళ్ల నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు, నీటి శుద్ది ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్బంగా కోరారు.
మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశను చేపట్టేందుకు అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాలు, శిక్షణను అందించేందుకు శిక్షణా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పురోభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామని పాండియన్ తెలిపారు.