తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా నంది అవార్డు (Nandi Awards)ల పేరును మార్చింది. ఇక నుంచి నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డుల (Gaddar Awards)ను అందజేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.
ప్రతి ఏడాది గద్దర్ జయంతి రోజున ఈ అవార్డులను అందజేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఓ జీవోను తీసుకు వస్తామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
నంది అవార్డులను పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు తమను కోరారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక నుంచి సినీ రంగంలో ఉత్తమ నటులకు గద్దర్ అవార్డులను అందజేస్తామన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రధానం చేస్తామని ప్రకటించారు. తన మాటే జీవో అని వెల్లడించారు.
ప్రజా యుద్ద నౌక గద్దర్ విగ్రహాన్ని తెల్లపూర్లో ఏర్పాటు చేసేందుకు ఇటీవల హెచ్ఎండీఏ అనుమతులు మంజూరు చేసంది. ఈ క్రమంలో విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు విడుదల కూడా చేసింది. ఇటీవల గద్దర్ కూతురుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.