తెలంగాణలో పంటలు కోతకు వచ్చాయి. దీంతో రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించడం మొదలెట్టారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో కొందరు దళారులు రైతులను దగా చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధర కంటే వడ్లకు తక్కువ ధర చెల్లిస్తూ వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని సమాచారం.
తాజాగా జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగారు. సమస్య పెద్దది కావడంతో దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth reddy) సోషల్ మీడియా వేదిక ఎక్స్(X) ద్వారా స్పందించారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టంచేశారు. రైతుల (Farmers) కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదన్నారు.
జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహింత్ సింగ్కి నా అభినందనలు అని తెలిపారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రైతులను మోసం చేసినట్లు తమ దృష్టికి వస్తే ఎట్టి పరిస్థిత్లుల్లోనూ సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.