చంద్రబాబు (Chandrababu) కోసమే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలు చేస్తున్నారని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy). భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను చూసి ఉండమన్నారు. ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారని.. నాలుగేళ్లకోసారి భార్యలను మారుస్తాడని విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా? అని జగన్ అడిగారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు, మోసాలు చెప్పడమే చంద్రబాబు, పవన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దత్త పుత్రుడిని భీమవరంలో ప్రజలు తిరస్కరించారని.. ఆయన నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్నారు. పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ లేరని విమర్శించారు.
పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువేనని.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నామన్నారు జగన్. ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని.. పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వేస్తున్నామని తెలిపారు. విద్యా దీవెన ద్వారా 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్లు ఆర్థిక సాయం చేసినట్టు వివరించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.11,900 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. అలాగే, వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు.
నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశామన్న సీఎం.. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రుపురేఖల్ని మార్చామని తెలిపారు. 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించామని.. తరగతి గదులను డిజిటల్ క్లాస్ రూమ్ లుగా మార్చామని చెప్పారు. ఎంతో విలువైన బైజూస్ కంటెంట్ అందించామని.. స్కూళ్లల్లో సబ్జెక్ట్ టీచర్లను తీసుకొచ్చామని వివరించారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని చెప్పిన జగన్.. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు.