మరోవైపు దౌత్య వేత్తల విషయంలో కెనడా (Canada) కు అమెరికా (USA), బ్రిటన్ మద్దతుగా నిలిచాయి. భారత్‌లో 41 మంది కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని ఇండియా ఆదేశించడం సరికాదని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఆ మేరకు కెనడాలోని ట్రూడో సర్కార్ తన దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించడం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.
క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించేందుకు దౌత్యవేత్తలు అవసరమని పేర్కొన్నారు. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడ్డవద్దని తాము భారత్ ను కోరుతున్నట్టు చెప్పారు. అలాగే నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని భారత్ కు తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు బ్రిటన్ కూడా కెనడాకు వత్తాసు పలికింది. భారత్ నుంచి కెనడా దౌత్య వేత్తలను రీకాల్ చేసేలా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థించలేమని బ్రిటన్ విదేశాంఖ పేర్కొంది. దౌత్యవేత్తలకు కల్పించే దౌత్య రక్షణకు భారత్ ఏక పక్షంగా ఎత్తివేయడం సరికాదని పేర్కొంది. ఇది వియన్నా ఒప్పంద సూత్రాలకు వ్యతిరేకమని పేర్కొంది.
ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య నేపథ్యంలో కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఇటీవల భారత్ లో కెనడాకు చెందిన 41 మంది దౌత్య వేత్తలను రీకాల్ చేయాలని, లేని పక్షంలో ఆయా దౌత్య వేత్తలకు దౌత్యపరమైన రక్షణలను కల్పించబోమని భారత్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెనడా నిన్న తన 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేసింది.